జై బోలో గణేష్ మహరాజ్ జై

జై బోలో గణేష్ మహరాజ్ జై

http://namasthetelangaana.com/updates/2012/Sep/19/ganesh3.jpg




సర్వవిఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. 


          "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
         ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే!

         అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
         అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే"!

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) . (అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.
 
                     ''వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ! 
                     నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా''! 

 సర్వవిఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. దేవతా గణంలో అగ్ర పూజ ఆయనకే. వక్రతుండిగా, లంబోధరుడిగా, గజాననుడు , సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు, మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో కొలువుదీరాడు. సాక్షాత్తు వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రమిది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం తిరుపతి నగరానికి 70 కిలోమీటర్లు దూరంలో ఉంది. కాణిపాకం పూర్వ నామధేయం విహారిపురి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ దివ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం. రోజూ వేలాదిమంది భక్తులతో సందడిగా, గణనాధుడి నామస్మరణంతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. బహుదా నది ఒడ్డున అలరారుతున్న ఈ క్షేత్రం స్వామివారి లీలా విశేషాలకు వేదిక.
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం అతి పురాతనమైనది.


""11వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని చోళరాజైన మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించినట్టు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తోంది. అనంతరం 1336లో విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేసినట్లు తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం అనంతరంతర కాలంలో అనేక మార్పులకు చేర్పులకు గురైంది. బహుదానది ఒడ్డున అలరారుతున్న ఈ ఆలయం అనేక పురాణ కథలకు, స్వామివారి లీలావిశేషాలకు పుట్టిల్లుగా అలరారుతుంది"".

పురాణ కథ:                                ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక కూడా ఓ పురాణ గాథ ఉంది. పూర్వం ఆ ప్రాంతంలో చెవిటి, మూగ, గుడ్డి వాళ్ళైన ముగ్గురు సోదరులు తమ పొలంలో బావులు తీస్తుండగా ఒక్కసారిగా వారి గునపానికి రక్తపు మరకలు అంటాయట. దాంతో ఆశ్చర్యపోయిన ఆ సోదరులు ఏమిటాని చూడగా వినాయకుని విగ్రహం కనిపించిందట. అలా విగ్రహం కనిపించీ కనిపించగానే వికలాంగులైన ఆ ముగ్గురు సోదరులకు వారి లొపం తొలగిపొయి మామూలు మనుషులయ్యారట. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిసి తండోపతండలుగా (గుంపులుగింపులుగా)  గ్రామస్థులు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టారట. వారు కొట్టిన కొబ్బరికాయల నీరు ఎకరంపావు(1 &1/4 acre) వరకు పారిందట. తమిళంలో కాణి అంటే ఎకరంపావు భూమి అని అర్థం. పాంకం అంటే పారిందని అర్థం. కొబ్బరినీరు ఎకరం పావు పారింది కాబట్టి ఆ క్షేత్రానికి కాణిపాంకం అని పేరొచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా రూపాంతరం చెందింది.

                   కాణిపాకంలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకస్వామి లీలామయుడు. ఆశ్రీత జన రక్షకుడు. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు. ఈ ఆలయంలోని గర్భాలయంలోని బావిలో స్వామి దర్శనమిస్తాడు. స్వామివారి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహానికి ఓ విశేషం ఉంది. ఈ విగ్రహ సైజు క్రమంగా పెరుగుతుందని చెబుతారు. గత కొన్ని సంవత్సరాలకు పూర్వంకంటే ఇప్పటి విగ్రహం సైజులో బాగా పెరిగిందట. ఇంతకుముందు స్వామివారికి అమర్చిన ఆభరణాలు నేడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. కాణిపాకాన్ని ప్రమాణాలకు పెట్టింది పేరుగా చెబుతారు. స్వామివారి మీద నమ్మకం ఉంచి ప్రమాణాలుచేసే భక్తుల అభీష్టాలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ స్వామివారి సమక్షంలో చేసే ఎలాంటి వివాదమైన పరిష్కారమవుతుందని చెబుతారు. 


                    స్వామివారి పట్ల విశ్వాసముంచి, ఇక్కడున్న కుండంలో స్నానంచేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందంటారు. రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో స్వామివారు సిద్ధి, బుద్ధిల సమేతంగా కొలువుతీరారు. ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయస్వామి, నవగ్రహాలతోపాటు ఇతర దేవతామూర్తుల మందిరాలు కూడా ఉన్నాయి. దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి ఏటా వినాయక చవితిరోజులలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 20 రోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను చూచితీరాల్సిందే కానీ వర్ణింపశక్యం కాదు

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి